: సీఆర్పీఎఫ్ రక్షణ వలయంలో అపోలో ఆసుపత్రి
తమ అభిమాన నాయకురాలు, 'అమ్మ' జయలలిత ఆరోగ్యానికి సంబంధించి తమిళ ఛానళ్లలో పుకార్లు వస్తుండటంతో, చెన్నైలోని అపోలో ఆసుపత్రి ఎదుట ఉన్న అన్నాడీఎంకే శ్రేణుల్లో అలజడి మొదలైంది. ఈ నేపథ్యంలో, వారు నియంత్రణ కోల్పోతున్నారు. అపోలో ఆసుపత్రిలోకి చొచ్చుకుపోవడానికి వారు యత్నిస్తున్నారు. అక్కడ ఉంచిన బ్యారికేడ్లను విసిరిపారేస్తున్నారు. ఆసుపత్రిపై చెప్పులు, రాళ్లు రువ్వుతున్నారు. హాస్పిటల్ లోపలకు, బయటకు వస్తున్న వాహనాలపై దాడులు చేస్తున్నారు. దీంతో, జయ అభిమానులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. మరోవైపు, ఇలాంటి పరిస్థితిని ముందుగానే ఊహించిన పోలీసు శాఖ... మధ్యాహ్నం నుంచే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ప్రస్తుతం అపోలో ఆసుపత్రి మొత్తం కేంద్ర బలగాలైన సీఆర్పీఎఫ్ రక్షణ వలయంలో ఉంది. ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా భద్రతా బలగాలు చర్యలు తీసుకుంటున్నాయి.