: పెళ్లి వేడుకకు వచ్చిన అతిథులకి టీ మాత్రమే ఇచ్చారు!
పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశ వ్యాప్తంగా ఎన్నో పెళ్లిళ్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే, పలు కుటుంబాలు మాత్రం పెళ్లిళ్లు వాయిదా వేయకుండా నిరాడంబరంగా వివాహ తంతుని జరుపుకుంటున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్నాలమ్ జిల్లా కేంద్రంలో కపిల్ రాథోడ్, అంతిమ్ ల పెళ్లివేడుకకు వచ్చిన అతిథులకు పప్పు అన్నం, స్వీట్లు లాంటివి పెట్టకుండా కప్పు టీ మాత్రమే ఇచ్చారు. ఎటువంటి హంగూ ఆర్భాటాలు లేకుండా తమ వివాహాన్ని నిన్న వీరు ఓ రామమందిరంలో జరుపుకున్నారు. అలాగే మొన్న రిజిస్టర్ ఆఫీసులోనూ వారు పెళ్లి చేసుకున్నారు. వివాహ వేడుకకు వచ్చిన అథిధులు ఈ జంటను ఆశీర్వదించి, అనవసర ఖర్చులు లేకుండా పెళ్లి చేసుకున్నారని మెచ్చుకున్నారు. ఈ పెళ్లి వేడుకకు మొత్తం 800 మంది అతిథులు రాగా, టీతో పాటు మిగతా ఖర్చుల కోసం రూ.1000 మాత్రమే వెచ్చించినట్టు తెలుస్తోంది. కపిల్ రాథోడ్, అంతిమ్‌లకు మూడునెలల క్రితం వివాహ నిశ్చితార్ధం జరిగింది.