: గుండెపోటు తరువాత 'ఎక్మో'పై జయ... చివరి ప్రయత్నమే ఇది... ఎక్మో ఇలా పనిచేస్తుంది..!
చెన్నై ఆసుపత్రిలో గడచిన 72 రోజులుగా చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం గుండెపోటుకు గురైన సీఎం జయలలిత (68)కు ప్రస్తుతం 'ఎక్మో' సిస్టమ్ ఆధారంగా చికిత్సను అందిస్తున్నట్టు అపోలో జాయింట్ ఎండీ సంగీతా రెడ్డి తెలిపారు. ఇదే విషయాన్ని వైద్యులు కూడా స్పష్టం చేశారు. ఎక్మో (ఎక్స్ ట్రా కార్పోరల్ మెబ్రేన్ ఆక్సిజనేషన్) పరికరాన్ని లైఫ్ సపోర్ట్ సిస్టమ్ గా పరిగణిస్తారు. శరీరానికి కావాల్సినంత ఆక్సిజన్ అందకున్నా, రక్త సరఫరా సక్రమంగా జరగకున్నా, అంటే రోగి ఊపిరితిత్తులు, హృదయం చేయాల్సిన పని చేయని వేళ ఎక్మోను వాడతారు. రోగి ఎప్పుడైతే సంప్రదాయ పద్ధతులైన సీపీఆర్ (కార్డియో పల్మనరీ రెస్యూసిటేషన్)కు స్పందించకుంటే ఎక్మో పరికరాన్ని వినియోగించి, కొంత వరకూ పరిస్థితిని చెయ్యి దాటకుండా నియంత్రించవచ్చు. రక్త నాళాల్లోని రక్త సరఫరాను పర్యవేక్షిస్తూ, రక్తానికి అవసరమైన ఆక్సిజన్ ను ఈ యంత్రం అందిస్తుంది. దీన్ని వాడుతుంటే, శరీరంలోని రక్త ప్రసరణ గుండె, ఊపిరితిత్తులతో సంబంధం లేకుండా జరుగుతూ ఉంటుంది. ఇక ఈ యంత్రం వాడుతూ ఒక రోగిని కొన్ని రోజులు, వారాల పాటు ప్రాణాలతో ఉంచవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. "ఎక్మోను ఊపిరితిత్తులు పూర్తిగా పనిచేయని స్థితిలోనే వాడతారు. వైద్యులు చివరిగా చేసే ప్రయత్నమే ఇది. కొంతకాలం పాటు శరీర అవయవాలు చేయలేని పనులను చేసే యంత్రమే ఇది. రోగిలో కోలుకునే శక్తి ఏ మాత్రం ఉన్నా, ఈ ఎక్మో పరికరం, అందుకు తనవంతు సహకారాన్ని అందిస్తుంది" అని సీనియర్ కార్డియాలజిస్టు నరేష్ తెహ్రాన్ వెల్లడించారు. ఇక జయలలిత ఎక్మోపై ఉన్నారని తెలుసుకున్న ఆమె అభిమానులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు.