: దక్షిణ అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం.. నేడు తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం
బంగాళాఖాతంలోని దక్షిణ అండమాన్ ప్రాంతంలో ఆదివారం నాడు అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడక్కడ చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం, హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం ఆదివారం రాత్రే తీవ్ర అల్పపీడనంగా మారిందని, సోమవారానికి అది వాయుగుండంగా మారే అవకాశం ఉందని, మంగళవారం నాటికి అది మరింత తీవ్రతరమవుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వాయుగుండం ప్రభావంతో మరో రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.