: పోలీసుల దిగ్బంధంలో అపోలో.. కార్యకర్తలు, అభిమానులపై లాఠీచార్జ్.. టెన్షన్.. టెన్షన్
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జె.జయలలిత ఆదివారం సాయంత్రం గుండెపోటుకు గురైన విషయం తెలుసుకున్న అభిమానులు రాష్ట్రం నలుమూలల నుంచి ఆస్పత్రికి తరలివస్తున్నారు. పిల్లలు, పెద్దలు, మహిళలు.. ఇలా వీరువారు అనే తేడా లేకుండా లక్షల్లో ఆస్పత్రికి చేరుకుంటున్నారు. ‘అమ్మ’ ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. జయ త్వరగా కోలుకోవాలంటూ ఆస్పత్రి బయట ప్రార్థనలు చేస్తున్నారు. మరికొందరు జయ ఫొటోలను ప్రదర్శిస్తూ ‘లాంగ్ లివ్ అమ్మ’ అంటూ నినాదాలు చేస్తున్నారు. అమ్మ ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నారు. మరోవైపు కొందరు అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తలు ఆస్పత్రిలోకి చొచ్చుకువెళ్లేందుకు ప్రయత్నించడంతో ఆస్పత్రి వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తొక్కిసలాట జరగడంతో పలువురు గాయపడ్డారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు ఆస్పత్రి లోపల, బయట భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు లాఠీ చార్జీ చేశారు. ఆస్పత్రి చుట్టుపక్కల ఉన్న హోటళ్లు, కార్యాలయాలను మూసివేయించారు. ఆస్పత్రికి దారితీసే అన్ని ప్రధాన రహదారులను తమ అధీనంలోకి తీసుకున్నారు. బారికేడ్లను ఏర్పాటు చేశారు. అపోలో వద్ద ప్రస్తుతం కర్ఫ్యూ లాంటి వాతావరణం నెలకొంది.