: దేశీయంగా తయారు చేసిన తేజస్ విమానాలను విమానవాహక నౌకలపై వినియోగించలేం: ఇండియన్ నేవీ
పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ 'తేజస్' విమానాలను విమానవాహక నౌకలపై వినియోగించలేమని ఇండియన్ నేవీ ప్రకటించింది. ఈ మేరకు చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ సునీల్ లాన్బా ఓ ప్రకటనను విడుదల చేశారు. నేవీకి తేజస్ బాగా ఉపయోగపడుతుందని తాము భావించామని... కానీ, వాటి బరువు అధికంగా ఉండటంతో, వాటి వినియోగం అసాధ్యమని చెప్పారు. విమానవాహక నౌకల సామర్థ్యం కంటే వీటి బరువు అధికంగా ఉందని ఆయన చెప్పారు. తేజస్ జెట్లకు అనుగుణంగా ఉండే విమానవాహక నౌక నేవీకి అవసరమని చెప్పారు. మరోవైపు, ప్రస్తుతం మిగ్-29 జెట్లను విక్రమాదిత్య నౌకపై వినియోగిస్తున్నామని... దేశీయంగా తయారైన విక్రాంత్ నౌక మీద కూడా మిగ్-29లనే ఉపయోగించనున్నామని తెలిపారు. కాగా, తేజస్ లను ఇప్పటికే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో వినియోగిస్తున్నారు.