: అప్పుడే కొరడా ఝళిపిస్తున్న ట్రంప్.. అమెరికా కంపెనీలకు హెచ్చరికలు
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే అధికారం చెలాయించడం మొదలుపెట్టారు. అమెరికాలోని కంపెనీలకు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఏదో ఒక సాకు చెప్పి అమెరికా బయట పరిశ్రమలు పెట్టేందుకు మొగ్గుచూపే కంపెనీలను ఊరికే వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అటువంటి కంపెనీలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కాదూ కూడదని మొండికేస్తే ప్రభుత్వ రాయితీలు రద్దు చేస్తామన్నారు. తనతో కలిసి వస్తే మాత్రం కంపెనీల ఉత్పత్తులు, సేవలపై విధించే 30 శాతం టారిఫ్‌ను 15 శాతానికి తగ్గిస్తానని తెలిపారు. అనుమతులు తేలికగా దొరకడం, కావలసినన్ని వనరుల లభ్యత, చట్టాలు అనుకూలంగా ఉండడం, మానవ వనరులు తగినన్ని అందుబాటులో ఉండడంతో అమెరికాలోని చాలా కంపెనీలు మెక్సికో, చైనా, భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకునే ట్రంప్ పై హెచ్చరికలు జారీ చేశారు. అలా ఎట్టిపరిస్థితుల్లోనూ జరగనిచ్చేది లేదని కుండబద్దలు కొట్టారు. ఇండియానాలో ఓ ఏసీ ప్లాంటును సందర్శించిన సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ సందర్శించిన కంపెనీని మెక్సికోకు తరలించేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోంది. ఫలితంగా దాదాపు 11 వందలమంది కార్మికులు రోడ్డున పడనున్నారు. దీంతో స్పందించిన ట్రంప్ వెంటనే కంపెనీ యాజమాన్యం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే రాయితీలు ఆపేస్తామని హెచ్చరించారు.