: ప్రజాదరణ అంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉంది: సుబ్రహ్మణ్యస్వామి
పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో దేశంలో నెలకొన్న పరిస్థితులను సరిదిద్దకపోతే ప్రజాదరణ అంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉందని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యానించారు. ఒక ఇంగ్లీష్ న్యూస్ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, ఇందిరాగాంధీ ప్రధాని ఉన్న సమయంలో దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు కూడా ఆరు నెలల పాటు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని, ఆ తర్వాత ఆమె ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చిందనే విషయాన్ని గుర్తుచేశారు. పెద్దనోట్ల రద్దు కారణంగా తలెత్తిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీకి సూచించారు. నోట్ల రద్దుతో ప్రజలకు కొంతమేర ఇబ్బందులు కలిగినా దాని ప్రభావం 2019 ఎన్నికలపై చూపదని సుబ్రహ్మణ్యస్వామి అభిప్రాయపడ్డారు. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీని కూడా ఆయన విమర్శించారు. దేశానికి కావాల్సింది ఆర్థికవేత్త అయిన ఆర్థికమంత్రి కానీ, 2+2=4 అని చెప్పేవారు కాదంటూ విమర్శలు గుప్పించారు.