: మోదీ కన్ను మహిళల బంగారంపై పడటం దురదృష్టకరం: రఘువీరా
బంగారంపై కేంద్రప్రభుత్వం చట్టం చేయడం పట్ల ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ప్రధాన మంత్రి మోదీపై విమర్శలు గుప్పించారు. బంగారం అనేది తల్లీబిడ్డల అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని, ఇప్పుడు ప్రధాని కన్ను మహిళల బంగారంపై పడటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ ఇలాగే నగదు రహిత, బంగారం రహిత భారత్ అంటూ ప్రజలను కష్టాలకు గురిచేస్తే ప్రజలంతా కలిసి 'భారతీయ జనతా పార్టీ రహిత భారత్'ను చేస్తారని ఆయన విమర్శించారు. నల్లధనంపై యుద్ధం అంటూ వ్యాఖ్యలు చేస్తోన్న మోదీకి ఆయన ఎన్నికల ప్రచారానికి ఉపయోగించిన 5 వేల కోట్ల రూపాలయలు ఎక్కడి నుంచి వచ్చాయని రఘువీరా రెడ్డి ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో మోదీ కొండను తవ్వి ఎలుకను పట్టబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో 100 రోజుల్లో ఇండియాకు నల్లధనం తీసుకొస్తానని చెప్పిన మోదీ, ఇప్పుడు ప్రజలను ఆ అంశం నుంచి పక్కదారి పట్టించేందుకే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు.