: అంబానీ 25 నిమిషాల స్పీచ్ కు 3,000 కోట్లు ఆవిరైపోయాయి!
జియో సేవలను మరో మూడు నెలలపాటు వినియోగదారులకు ఉచితంగా అందిస్తున్నామంటూ రిలయన్స్ యజమాని ముఖేష్ అంబానీ చేసిన ప్రసంగం ప్రత్యర్థులకు తీరని నష్టం కలిగించింది. జియో రంగప్రవేశం రోజున ఒక్కసారిగా 16,000 కోట్ల రూపాయలు నష్టపోయి కుదేలైన టెలికాం సంస్థల షేర్లు తిరిగి... ముఖేష్ అంబానీ తాజా నిర్ణయంతో సుమారు 3,000 కోట్ల రూపాయలు నష్టపోయాయి. టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్ టెల్ 1.66 శాతం, ఐడియా సెల్యులార్ 5.93 శాతం, రిలయన్స్ కమ్యూనికేషన్ 5.05 శాతం నష్టపోయాయి. అదే సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ 1 శాతం లాభపడింది. షేర్ మార్కెట్ లో ముఖేష్ అంబానీ ప్రసంగ ప్రారంభానికి ముందు వరకు 324 రూపాయల వద్ద ట్రేడ్ అయిన ఎయిర్ టెల్ షేర్లు, ఆయన స్పీచ్ ప్రారంభం కాగనే 318.3 రూపాయలకు పడిపోయాయి. దీంతో ఎయిర్ టెల్ మార్కెట్ విలువలో 2,276 కోట్ల రూపాయలు తుడిచిపెట్టుకుపోయాయి. ముఖేష్ అంబానీ ప్రసంగానికి ముందు వరకు 76.60 రూపాయలతో ట్రేడ్ అయిన ఐడియా సెల్యులార్ షేర్లు ఆయన స్పీచ్ తరువాత 74.20 రూపాయలకు పడిపోయాయి. దీంతో ఈ సంస్థ 792 కోట్ల రూపాయలు కోల్పోయింది.