: ఇంకా రెండేళ్లే చంద్రబాబు పాలన ఉంటుంది: కృష్ణా జిల్లా కోన గ్రామంలో వైఎస్ జగన్
కృష్ణా జిల్లాలో పర్యటిస్తూ రైతుల కష్టాలను గురించి తెలుసుకుంటున్న వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బుద్ధాలపాలెంలో రైతులతో ముఖాముఖి నిర్వహించిన తరువాత కోనలో రైతులతో చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా తాము పడుతున్న బాధలపై రైతులు జగన్‌కి వివరించారు. ముఖాముఖిలో జగన్ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాలన ఇంకా రెండేళ్లు మాత్రమే ఉంటుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సర్కారు బంగాళాఖాతంలో కలవక తప్పదని వ్యాఖ్యానించారు. బాబు ప్రభుత్వం వెళ్లిపోగానే రైతుల ముఖాల్లో మళ్లీ ఆనందం కనిపిస్తుందని జగన్ అన్నారు. రైతులు వ్యవసాయం చేసుకోవడానికి డబ్బులిచ్చేవారే కనిపించడం లేదని అన్నారు. రైతులు తమ భూములను అమ్ముకునే అవకాశం కూడా చంద్రబాబు ఇవ్వడం లేదని వ్యాఖ్యానించారు. పోర్టు పేరుతో భూములని లాక్కుంటున్నారని అన్నారు. మన భూములను మనం కాపాడుకుందామని పిలుపునిచ్చారు. అందరం కలిసి కట్టుగా ఉంటే చంద్రబాబు ఆటలు సాగవని వ్యాఖ్యానించారు. భూములను బలవంతంగా లాక్కుంటే రైతులు తిరగబడతారని అన్నారు.