: ఇంత నోట్ల కొరతలోనూ మారుతి సుజుకి హవా... నవంబర్ లో 12 శాతం పెరిగిన అమ్మకాలు


ఇండియాలో అత్యధికంగా కార్లను విక్రయిస్తున్న మారుతీ సుజుకీపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం కనిపించలేదు. వాహన రంగంలో విక్రయాలు గణనీయంగా తగ్గుతాయని నిపుణులు అంచనా వేయగా, గడచిన నవంబర్‌ నెలలో మారుతి సుజుకి సత్తాను చాటి, కార్ల విక్రయాల్లో 12.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత సంవత్సరం నవంబర్ లో సంస్థ విక్రయించిన 1.2 లక్షల యూనిట్లతో పోలిస్తే, ఈ ఏడు 15 వేల అధిక యూనిట్లను విక్రయించింది. ఇక మొత్తం అమ్మకాల్లో దేశవాళీ విక్రయాలు 14.2 శాతం పెరిగి 1.26 లక్షల యూనిట్లకు చేరగా, ఎగుమతులు 9.8 శాతం తగ్గి 9,225 యూనిట్లకు పరిమితం అయ్యాయని మారుతి సుజుకి వెల్లడించింది. విటారా బ్రెజా, ఎర్టిగా మోడల్స్ ఉన్న యుటిలిటీ వెహికిల్ సెగ్మెంట్ అమ్మకాలు 98 శాతం పెరిగాయని, కాంపాక్ట్ కార్ విభాగం 10.8 శాతం వృద్ధిని నమోదు చేసిందని సంస్థ పేర్కొంది. కాగా, మారుతీ సుజుకి అమ్మకాలు పెరిగాయన్న వార్త స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచింది. దీంతో ఈక్విటీకి కొనుగోలు మద్దతు పెరిగింది. ఒక దశలో అర శాతానికి పైగా లాభపడ్డ మారుతి సుజుకి ఈక్విటీ మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో క్రితం ముగింపుతో పోలిస్తే 0.24 శాతం లాభపడి రూ. 5,275 వద్ద కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News