: ఆ బామ్మ జుట్టు నుంచి దుస్తులవరకు అంతా ఆకుపచ్చమయం!
ఆకుపచ్చని రంగుని చూస్తే మనసుకి ఆహ్లాదకరమైన అనుభూతి కలుగుతుందని వైద్యులు చెబుతుంటారు. నగరీకరణ నేపథ్యంలో తమ ఇంటి పరిసరాలలో చెట్లు కనిపించకపోవడంతో ఉదయాన్నే ఆకుపచ్చని రంగుని చూసే అవకాశం ఎంతో మందికి లేకుండా పోతోంది. అయితే, అమెరికాలోని ఓ బామ్మ ఇంటికి వెళ్లి చూస్తే మాత్రం అంతా ఆకుపచ్చని రంగే కనిపిస్తుంది. ఆకుపచ్చరంగు అనగానే ఆమె ఇంటి పరిసరాల్లో అన్నీ చెట్లే ఉంటాయని అనుకుంటే పొరపాటే. ఆ బామ్మ ఇంట్లో అన్ని వస్తువులూ ఆ రంగులోనే కనిపిస్తాయి. తన ఇంటిని మొత్తం ఆకుపచ్చమయంగా చేసేసిన ఆ బామ్మ కథేంటో చూద్దాం.. ఆకుపచ్చ రంగంటే ఎంతో ఇష్టాన్ని చూపే న్యూయార్క్‌కు చెందిన ఎలిజబెత్ అనే 74 ఏళ్ల బామ్మ తన ఇంట్లోని వస్తువులన్నీ తనకు నచ్చిన రంగులోనే ఉండేలా చూసుకుంటోంది. ఇరవై ఏళ్లుగా పచ్చని రంగు దుస్తులను, వస్తువులను మాత్రమే వినియోగిస్తోంది. మొదట్లో ఆ బామ్మ పింక్, సిల్వర్, పర్పుల్, నీలి రంగు కాస్ట్యూమ్స్‌ను ఇష్టపడేదట. బయటకి వెళ్లే సమయంలో తన ఒంటిపై ధరించినవన్నీ ఒకే రంగులో ఉండాలని కోరుకునేది. ఈ క్రమంలో, ఆ బామ్మ ఓ సారి తన గోళ్లకు ఆకుపచ్చ రంగు పెయింట్ వేసుకుంది. ఆ రంగు ఎంతగానో నచ్చేసింది. ఇక అప్పటినుంచి తన జుట్టు రంగు దగ్గర్నుంచి దుస్తులు, ఆమె ఇంట్లోని అలంకరణ వస్తువులు, ఫర్నీచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు ఇలా ఒకటేంటీ అన్నింటినీ ఆకుపచ్చ రంగులోనే ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రపంచంలో అధిక శాతం మందికి ఆకుపచ్చ రంగు అంటేనే ఎంతో ఇష్టం కాబట్టి, తన ఇంట్లోనే కాక ఒంటిపై కూడా ఆ రంగే ఉండేలా చూసుకుంటున్నానని చెబుతోంది. దీంతో ఈ బామ్మను అక్కడి ప్రజలంతా ‘మిస్ గ్రీన్’ అని పిలుచుకుంటున్నారు.