: కోల్ కతాలో వైద్యుడి నుంచి రూ.10 లక్షల కొత్త నోట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు
పెద్దనోట్లను రద్ద చేసి మూడు వారాలు దాటినా ఇప్పటికీ ఎంతో మందికి నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి కావలసినంత డబ్బు దొరక్క ఎన్నో ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు కొందరు అక్రమార్కుల చేతులకి మాత్రం లక్షల కొద్దీ డబ్బు అందుతోంది. తాజాగా కోల్‌కతాలోని ఒక వైద్యుడి వద్ద పోలీసులు రూ.10 లక్షల కొత్తనోట్లను స్వాధీనం చేసుకున్నారు. అతడి వద్ద మరో రూ.4 లక్షల విలువ చేసే విదేశీ కరెన్సీని కూడా సీజ్ చేసి ఫెమా, పీఎంఎల్ఏ చట్టాల కింద ఈడీ అధికారులు కేసులు నమోదు చేశారు. వైద్యుడు నల్లధనాన్ని మార్చుకున్నాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈడీ అధికారులు తాజాగా సుమారు 40 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఇందుకోసం వారు వివిధ నగరాల్లో స్థానిక పోలీసుల సాయం తీసుకొని బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేశారు. ఈ నేపథ్యంలోనే పాతనోట్లతో పాటు కొత్త నోట్లు పట్టుబడుతున్నాయి. కోల్‌కతాలో ఆరు ప్రాంతాల్లోను, భువనేశ్వర్, పారాదీప్, గౌహతిలో రెండుచోట్ల ఈడీ అధికారులు ఈ దాడులు చేశారు.