: భోపాల్ లో బీజేపీ మహిళా నేత దారుణ హత్య... కాల్చి చంపిన దుండగులు
భారతీయ జనతా పార్టీ మహిళా నేత జమీలా బీ దారుణ హత్యకు గురయ్యారు. భోపాల్ లో గుర్తు తెలియని దుండగులు ఆమెను కాల్చి చంపారు. 50 సంవత్సరాల జమీలా బీ, ఇందిరా సాహిత్య నగర్ లోని ఆమె నివాసంలోనే హత్యకు గురయ్యారని పోలీసు అధికారి ముఖ్తార్ ఖురేషీ వెల్లడించారు. లోపలి నుంచి బయటకు వచ్చిన ఆమె కుమారుడు, వెంటనే తన తల్లిని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆమె చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. కాగా, ఇంట్లో చాలా మంది ఉన్నప్పటికీ, కాల్పుల శబ్దాన్ని ఎవరూ వినకపోవడం కేసులో అనుమానాలను రేకెత్తిస్తోంది. హత్యకు గల కారణాలు తెలియరావడం లేదని, కేసును విచారిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.