: అమెరికాలోనే లేదు..ఇండియాలో వందశాతం ఆన్ లైన్ లావాదేవీలు ఎలా సాధ్యమవుతాయి? : టీడీపీ నేత ముద్దుకృష్ణమనాయుడు
పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో సామాన్య ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం కరెక్టు కాదని టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు విమర్శించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘అగ్రరాజ్యం అమెరికాలోనే వందశాతం ఆన్ లైన్ లావాదేవీలు జరగట్లేదు, అలాంటప్పుడు, ఇండియాలో ఎలా సాధ్యమవుతుంది? ’ అని టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమనాయుడు ప్రశ్నించారు. ఇండియాలో ఆన్ లైన్ లావాదేవీలు కేవలం 2 శాతం మాత్రమే జరుగుతున్నాయని అన్నారు. ప్రపంచంలోని పలు దేశాల్లో ఆన్ లైన్ లావాదేవీలు ఎంత శాతం మేరకు జరుగుతున్నాయో ఆ వివరాలను ఆయన ప్రస్తావించారు. అగ్రరాజ్యమైన అమెరికాలో 45 శాతం మేరకే ఆన్ లైన్ లావాదేవీలు జరుగుతున్నాయని, మిగిలిన 55 శాతం లావాదేవీలు నగదు చెల్లింపుల ద్వారానే జరుగుతున్నాయన్నారు. మన దేశంలో నగదు లావాదేవీలు 98 శాతం వరకు నడుస్తున్నాయని, మన దేశంలో వందశాతం అక్షరాస్యత లేదని, ఈ విషయంలో మిగిలిన దేశాలు మెరుగ్గా ఉన్నాయని అన్నారు. మనదేశంలో ముప్ఫై కిలోమీటర్ల దూరం వెళితే గానీ పాఠశాల, ఆసుపత్రి, బ్యాంకులకు వెళ్లలేని పరిస్థితులు ఉన్న ప్రాంతాలు ఉన్నాయన్నారు. దేశంలో నల్లధనం ఉన్నవాళ్లు, అవినీతిపరులు రెండు శాతం మేరకే ఉంటారని వారి కోసం 98 శాతం ప్రజలను ఇబ్బంది పెట్టడం సబబు కాదని ఆయన అన్నారు.