: నరేంద్ర మోదీ నోట్ల రద్దు... ఏ రంగంపై ఎంత ప్రభావం చూపిస్తోందంటే..!
నవంబర్ 8... నేటి తరం ఎన్నాళ్లయినా, ఎన్నేళ్లయినా గుర్తు పెట్టుకునే తేదీ. చలామణిలో ఉన్న రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేసిన తేదీ అది. నోట్ల రద్దు తరువాత రైతులు, పేదలు, మధ్యతరగతి వారు, కూలీలు, చిన్న చిన్న వ్యాపారులు... ఇలా ప్రజల నుంచి నిర్మాణ, వాహన, బీమా రంగాల వరకూ అన్నింటా ప్రభావం పడింది. ఎంతగా అంటే, 8 శాతం వృద్ధితో దూసుకెళుతున్న భారత జీడీపీ ఒక్కసారిగా రెండు శాతం కుంచించుకుపోయి, 6 శాతానికి పరిమితం అయ్యేంత. ఇక ఏ రంగంపై నోట్ల రద్దు ప్రభావం ఏ మేరకు చూపనుందన్న విషయమై నిపుణులు ఏమంటున్నారంటే.... * వాహన రంగం: సానుకూలాంశాలు: వడ్డీ రేట్లు, పన్ను భారం తగ్గే అవకాశాలున్నాయి. వ్యతిరేకత: ఇప్పటికే ద్విచక్రవాహనాలు, కార్లు తదితర వాహనాల అమ్మకాలు తగ్గాయి. కమర్షియల్ వాహనాలు, లగ్జరీ కార్ల విక్రయాలు మరింతగా దిగజారుతాయి. మొత్తం మీద ప్రభావం: నవంబర్ నెలలో వాహన విక్రయాలు 40 నుంచి 50 శాతం తగ్గుతాయని అంచనా. వాణిజ్య వాహన విభాగంలో 50 నుంచి 60 శాతం, ద్విచక్ర వాహన విభాగంలో 20 నుంచి 40 శాతం వరకూ విక్రయాలు తగ్గుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ రంగంలో కమర్షియల్ వాహనాలు, ద్విచక్ర వాహనాలు, లగ్జరీ కార్లపై నోట్ల రద్దు అమితమైన ప్రభావం చూపుతోంది. కొత్త వాహనాల బుకింగ్స్ 50 శాతం తగ్గాయని ముంబై కేంద్రంగా ఆడి వాహనాల డీలర్ గౌతమ్ మోదీ వెల్లడించారు. ఎంట్రీ లెవల్ మోటార్ సైకిల్ అమ్మకాలు సైతం తగ్గుతున్నాయని తెలిపారు. * ఆతిథ్య, ప్రయాణ రంగాలు: సానుకూలాంశాలు: క్రెడిట్ కార్డుల వాడకం పెరుగుతుంది, క్యాష్ బ్యాకప్ ఆకర్షిస్తుంది డిజిటల్ చెల్లింపులు గణనీయం, కీలకం అవుతాయి. వ్యతిరేకత: గతంలో బుక్ చేసుకున్న ప్రయాణాల్లో 33 శాతం వరకూ రద్దవుతున్నాయి. రెస్టారెంట్లలో డిన్నర్ లు పూర్తిగా తగ్గాయి. దేశానికి వచ్చే విదేశీ టూరిస్టులు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. విమానాలు ఎక్కే వారి సంఖ్య తగ్గుతోంది. టికెట్ల రద్దు పెరగడం ఎయిర్ లైన్స్ పై నెగటివ్ ఇంపాక్ట్ చూపుతోంది. మొత్తం మీద ప్రభావం: ఢిల్లీలోని రెస్టారెంట్లలో ముందస్తు రిజర్వేషన్లు 28 శాతం తగ్గాయి. టూరిజంపై నోట్ల రద్దు ప్రభావం అనుకున్న దానికన్నా ఎక్కువగానే ఉంది. వందలాది మంది తమ ప్రయాణాలు వాయిదా వేసుకున్నారు. చిల్లర లేక ఒకచోటి నుంచి మరో చోటికి వెళ్లడాన్ని వాయిదా వేసుకుంటున్నారు. ఇండియా నుంచి థాయ్ ల్యాండ్, సింగపూర్, మలేషియా, మాల్దీవులు, హవాయ్, నేపాల్, దుబాయ్ తదితర ప్రాంతాలకు ముందుగా ప్లాన్ చేసుకున్న వారు నోట్ల రద్దు తరువాత ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న పరిస్థితి. ముంబై, బెంగళూరు తదితర మెట్రోల్లో హోటల్ పరిశ్రమపైనా నోట్ల రద్దు ప్రభావం అధికంగా ఉంది. * గృహోపకరణాల రంగం: సానుకూలాంశాలు: సున్నా శాతం వడ్డీకి, పేమెంట్ హాలిడే ఆఫర్లపై వస్తు లభ్యత. వ్యతిరేకత: గ్రామీణ భారతావనిలో కొనుగోలు శక్తి అత్యంత తక్కువ స్థాయికి పతనం. ఎఫ్ఎంసీజీ రంగంలో వృద్ధి రేటు కోత. మొత్తం మీద ప్రభావం: నోట్ల రద్దు తరువాత ఎఫ్ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్) విభాగం 20 నుంచి 30 శాతం దిగజారింది. ఇందులో అత్యధిక ప్రాతినిధ్యం గ్రామీణ భారతావనిదే. అన్ని ఎఫ్ఎంసీజీ కంపెనీల ఆదాయంలో 45 శాతం వరకూ గ్రామాల నుంచే వస్తుండగా, ఇప్పుడది 10 శాతం కన్నా తక్కువకు పడిపోయింది. బాడీ క్రీమ్స్, ఆయిల్స్, డియోడరెంట్లు, హైఎండ్ షాంపూలు, స్నాక్స్, చాక్లెట్లు తదితరాలను గ్రామాల్లో ఎవరూ కొనని పరిస్థితి నెలకొందని ఎడిల్ వైజెస్ సెక్యూరిటీస్ రిటైల్ అనలిస్ట్ అబ్నీష్ రాయ్ వెల్లడించారు. గ్రామాల్లో కార్డుల వాడకం లేకపోవడం, ప్రజల చిల్లర కష్టాలు ఇందుకు కారణమని ఆయన అన్నారు. * ఈ-కామర్స్ కంపెనీలపై: సానుకూలాంశాలు: క్యాష్ ఆన్ డెలివరీ తగ్గి, ఆన్ లైన్ చెల్లింపులు పెరుగుతాయి. యూనిట్ ఎకానమిక్స్ కు ఇది శుభ పరిణామం. వ్యతిరేకత: అన్ని కంపెనీల అమ్మకాలూ తగ్గుతాయి. చిన్న చిన్న సంస్థలు మూసేసుకునే పరిస్థితి. మొత్తం మీద ప్రభావం: నోట్ల రద్దుకు ముందు భారత ఈ-కామర్స్ రంగం రోజుకు 10 లక్షల ఉత్పత్తులను క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతిలో బట్వాడా చేసే స్థితిలో ఉంది. ఇప్పుడది వేలల్లోకి పడిపోయింది. నోట్ల రద్దు ప్రభావం అమేజాన్ వంటి కంపెనీలపై అధికంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో ఎలక్ట్రానిక్ చెల్లింపులు మాత్రం శరవేగంగా పెరుగుతున్నాయి. ఫ్రీ చార్జ్, పేటీఎం వంటి కంపెనీలను ఆశ్రయించే వారి సంఖ్య పెరిగింది. * బంగారం: సానుకూలాంశాలు: డిసెంబర్ తరువాత బంగారం ధర గణనీయంగా తగ్గే అవకాశం. వ్యతిరేకత: ప్రస్తుతానికి మాత్రం మధ్యతరగతి నుంచి బంగారం కొనుగోళ్లు దాదాపు శూన్యమే. మొత్తం మీద ప్రభావం: ముంబైలోని జవేరీ బజారు నోట్ల రద్దుకు ముందు రోజుకు రూ. 125 కోట్ల వ్యాపారాన్ని నమోదు చేసింది. 8వ తేదీన మోదీ ప్రకటన తరువాత సరాసరిన వ్యపారం రోజుకు రూ. 13 కోట్లకు తగ్గింది. బంగారం అమ్మకాలపై నోట్ల రద్దు ప్రభావం అధికంగా ఉందని ముంబై జ్యూయెలర్స్ అసోసియేషన్ వైస్ చైర్మన్ కుమార్ జైన్ వెల్లడించారు. పెళ్లిళ్ల సీజనులో సైతం అమ్మకాలు సంతృప్తికరంగా లేవని ఆయన అన్నారు. కొనుగోలు దారులు లేకపోవడంతో ఆభరణాల తయారీ రంగం కుంచించుకుపోయిందని తెలిపారు. * వినోద రంగం: సానుకూలాంశాలు: ఆన్ లైన్ బుకింగ్స్ పెరుగుతాయి. కార్డుల వాడకం విస్తరిస్తోంది. వ్యతిరేకత: దాదాపు 12కు పైగా సినిమా కంపెనీలు తమ చిత్రాల విడుదలను వాయిదా వేయగా, మరికొన్ని నిర్మాణాన్ని నిలిపివేశాయి. మొత్తం మీద ప్రభావం: నోట్ల రద్దు తరువాత వెంటనే ప్రభావం కనిపించిన రంగాల్లో వినోద రంగం (అత్యధిక ప్రాతినిధ్యం సినిమాలదే) ఒకటి. వారాంతాల్లో సైతం సినిమాలు చూసేందుకు ఎవరూ రాని పరిస్థితి నెలకొందని ఐనాక్స్ లీజర్ డైరెక్టర్ సిద్ధార్థ జైన్ అభిప్రాయపడ్డారు. బ్యాంకుల్లో క్యూలైన్లలో నిలిచేందుకే సమయం లేని ప్రజలు, ఇంత చిల్లర కష్టాల మధ్య సినిమాలు చూసేందుకు ఏం వస్తారని ఆయన ప్రశ్నించారు. ఇక పలు చిత్రాల విడుదల మూడు వారాల నుంచి రెండు నెలల పాటు వాయిదా పడ్డాయి. చెల్లింపులకు చాలినంత కరెన్సీ లేక, షూటింగులు సైతం రద్దవుతున్న పరిస్థితి.