: బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తనకు తెలుసన్న కేంద్ర మంత్రి
'బాహుబలి' సినిమా విడుదలైనప్పటి నుంచి బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే విషయంపై దేశ వ్యాప్తంగా చర్చ కొనసాగుతూనే ఉంది. ఎందుకు చంపాడన్న సంగతి దర్శకుడు రాజమౌళి, సినిమాలోని హీరోలకు తప్ప మరెవరికీ తెలియదు. కానీ, ఎందుకు చంపాడన్న విషయం తనకు తెలుసని కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ తెలిపారు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో స్వయంగా రాజమౌళే తనకు చెప్పారని... అందుకు అతనికి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. ప్రభుత్వానికి అన్ని విషయాలు తెలియాల్సి ఉంటుందని... కానీ, ఇలాంటి విషయాలను ప్రభుత్వం రహస్యంగా ఉంచుతుందనే రాజమౌళికి కూడా తెలుసని... అందుకే ఆయన ఆ విషయాన్ని తనకు తెలిపారని సరదాగా అన్నారు. అయితే, బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న సీక్రెట్ ను మాత్రం రాజ్యవర్ధన్ కూడా చెప్పకుండా దాటవేశారు.