: ఐఎస్ లో చేరిన అమన్ చనిపోయాడంటూ ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి
ఇస్లామిక్ స్టేట్ లో చేరిన అమన్ టాండెల్ చనిపోయినట్టు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. సంకీర్ణ సేనలు జరిపిన వైమానిక దాడుల్లో అమన్ చనిపోయాడంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు. అమన్ మహారాష్ట్రలోని కల్యాణ్ కు చెందినవాడు. 2014లో మరో నలుగురు యువకులతో కలసి ఐఎస్ లో చేరడానికి అమన్ వెళ్లాడు. మిగిలిన యువకులు కూడా కల్యాణ్ కు చెందినవారే. అమన్ మరణం గురించి ఫోన్ వచ్చిన సమయంలో... ఫోన్ లో మాట్లాడుతున్నది ఎవరంటూ అమన్ తండ్రి ప్రశ్నించగా... అవతలి వ్యక్తి ఫోన్ పెట్టేశాడు. అయితే, ఈ విషయాన్ని అమన్ కుటుంబ సభ్యులు పోలీసుల దృష్టికి తీసుకురాలేదు. అమన్ కుటుంబ సభ్యుల తమకు ఏమీ చెప్పలేదని... అవసరమైతే విచారణ జరుపుతామని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు. మరోవైపు, అమన్ తో పాటు ఐఎస్ లో చేరిన టంకీ అనే యువకుడు చనిపోయినట్టు గత జనవరిలోనే అతని కుటుంబ సభ్యులకు ఫోన్ వచ్చింది. అయితే ఆ సమాచారం నిజమా? కాదా? అనేది ఇంతవరకు నిర్ధారణ కాలేదు.