: కట్నంగా కొత్త నోట్లు ఇవ్వలేదని... కాళ్ల పారాణి ఆరకముందే నవవధువును చంపేశారు
కట్నంగా కొత్త నోట్లు ఇచ్చుకోలేకపోయిన పాపానికి ఓ నవవధువును అత్తింటి వారు అత్యంత కిరాతకంగా చంపేశారు. ఒడిశాలోని గంజాం జిల్లా రంగీపూర్లో సోమవారం జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. స్థానికంగా నివాసముండే ప్రభావతికి అదే గ్రామానికి చెందిన లక్ష్మీ సహక్తో ఈనెల 9న వివాహమైంది. వరుడికి కట్నం కింద రూ.1.70 లక్షలు ఇచ్చేందుకు వధువు తల్లిదండ్రులు అంగీకరించారు. అయితే సరిగ్గా పెళ్లికి ఒక రోజు ముందే పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రబుత్వం నిర్ణయం తీసుకుంది. పాత నోట్లు రద్దు కావడంతో ఇవ్వాల్సిన కట్నాన్ని కొత్త నోట్ల రూపంలో ఇవ్వాలని వరుడి తరపు బంధువులు కోరారు. అయితే ఇప్పటికిప్పుడు కొత్త నోట్లు ఎక్కడి నుంచి తెచ్చివ్వాలని, కొద్ది రోజుల్లోనే వాటిని మార్పించి ఇస్తామని హామీ ఇచ్చారు. పెళ్లి అయి పదిరోజులు గడుస్తున్నా వధువు తల్లిదండ్రులకు రద్దయిన పాత నోట్లను మార్పించడం సాధ్యం కాలేదు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన లక్ష్మీసహక్ తల్లిదండ్రులతో కలిసి భార్యను దారుణంగా హతమార్చాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రభావతిని తాము హత్యచేయలేదని, ఆత్మహత్య చేసుకుందని అత్తమామలు చెబుతున్నారు. లక్ష్మీసహక్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు.