: ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు.. బ్యాంకర్ల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తి
ప్రజల జీవితాలతో ఆడుకోవడం మంచిది కాదని బ్యాంకర్లు, అధికారులను ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. బ్యాంకర్లు, అధికారులతో తన కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు. పెద్దనోట్ల రద్దు అనంతర పరిస్థితులను చక్కదిద్దడంలో బ్యాంకర్లు విఫలమయ్యారని అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద ప్రజలు ఇప్పటికీ పడిగాపులు కాస్తున్న పరిస్థితి తలెత్తుతోందని అన్నారు. బ్యాంకర్ల సహాయ నిరాకరణ కారణంగా ప్రభుత్వం కూడా ఏం చేయలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. బ్యాంకులను సమన్వయం చేయాల్సిన ఆర్బీఐ, ఆ విషయంలో విఫలమైందని, సమావేశాలకు హాజరవుతున్న బ్యాంకుల ప్రతినిధుల వద్ద సరైన సమాచారం ఉండటం లేదని బాబు మండిపడ్డారు. సరైన సమాచారం లేకుండా సమీక్షలు నిర్వహిస్తే ఉపయోగం ఏముంటుందని చంద్రబాబు ప్రశ్నించారు.