: బీజేపీతో విడిపోతేనే టీడీపీకి అధిక సీట్లు వస్తాయా?.. ఆసక్తికర చర్చ!
ఇప్పటికిప్పుడు మరోసారి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగితే, 2014 ఎన్నికల కన్నా మంచి మెజారిటీతో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి మరోసారి అధికారంలోకి వస్తుందని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహించిన సర్వేలో వెల్లడించిన సంగతి తెలిసిందే. అంతవరకూ బాగానే ఉంది. ఇక తెలుగుదేశం - బీజేపీ కలసి పోటీ చేస్తే 120 అసెంబ్లీ సీట్లు; బీజేపీకి కటీఫ్ చెప్పి, తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేస్తే 140 సీట్ల వరకూ వస్తాయని చెప్పడం అటు రాజకీయ వర్గాల్లో, ఇటు ప్రజల్లో కొత్త చర్చకు దారితీసింది. బీజేపీతో విడిపోతే, ముస్లిం, మైనారిటీ వర్గాల ఓట్లు తెలుగుదేశం పార్టీకి పడతాయని, ఆ కారణంగానే చంద్రబాబు బలం మరింతగా పెరుగుతుందన్నది ఏబీఎన్ చెప్పిన కారణం. దీనిపై నేడు పలు టీవీ చానళ్లు విస్తృతంగా చర్చించాయి. సర్వే వాస్తవాలకు దూరంగా ఉందని, తమతో కటీఫ్ చెబితే, తెలుగుదేశంకు పుట్టగతులుండవని బీజేపీ నేతలు హెచ్చరించారు. ఫిరాయింపు రాజకీయాలను ప్రజలు చూస్తున్నారని, తెలుగుదేశం పార్టీకి మరోసారి ఓటేసే ఆలోచనలో ప్రజలు లేరని మరోపక్క వైకాపా నేతలు వ్యాఖ్యానించారు.