: నేడు కార్తీకమాసం చివరి సోమవారం... భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు
తెలుగు రాష్ట్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. పరమపవిత్రంగా భావించే కార్తీకమాసంలో నేడు చివరి సోమవారం కావడంతో భక్తులతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ఉదయాన్నే ఆలయాలకు చేరుకుంటున్న భక్తులు ప్రత్యేక పూజల్లో మునిగి తేలుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలన్నీ తెల్లవారుజాము నుంచే కిటకిటలాడుతున్నాయి. శివనామస్మరణతో పంచారామాలు మార్మోగుతున్నాయి. గోదావరి, కృష్ణా నదులు భక్తుల స్నానాలతో కళకళలాడుతున్నాయి. భక్తుల రద్దీని తట్టుకునేందుకు ఆలయాల అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. వేములవాడ రాజరాజేశ్వరి, వరంగల్లోని చారిత్రక రుద్రేశ్వరస్వామి, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి, శ్రీశైల మల్లన్న ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఇక విజయవాడ దుర్గగుడికి ఈ తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి మొదలైంది. గుణుపూడిలోని సోమేశ్వరుడు గోధుమవర్ణంలో మెరిసిపోతున్నాడు. పాలకొల్లు క్షీరలింగేశ్వరస్వామి ఆలయంలో దీపారాధన కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.