: పదిమంది శిశువులను కాపాడిన సీఐడీ పోలీసులు.. ఇప్పటికే 50 మంది పసికందులను విక్రయించిన ముఠా


త‌ల్లితో ఆడుకోవాల్సిన ఎంతో మంది చిన్నారులు క‌న్న‌వారికి దూర‌మ‌వుతున్నారు. ఆసుప‌త్రులు, స్వచ్ఛంద సంస్థలే చిన్నారుల ప‌ట్ల ఘోరంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. బొడ్డు కోసీకోయగానే వారిని తల్లులకు దూరం చేస్తున్నాయి. ప‌శ్చిమ బెంగాల్ లోని సోహన్‌ నర్సింగ్‌ హోంలో, అప్పుడే పుట్టిన‌ పసికందుల్ని బిస్కెట్‌ డబ్బాల్లో ఉంచి అమ్మేస్తున్న వైనం ఇటీవలే వెలుగులోకొచ్చిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఇటువంటి మ‌రో దారుణ‌మైన ఘ‌ట‌న అదే రాష్ట్రంలో వెలుగు చూసింది. కోల్‌కతాలో నివ‌సిస్తున్న కొంత‌మంది జ‌నాల‌ పేదరికంతో మాఫియా ఆడుకుంటోంది. పసిపిల్లలను వారి వ‌ద్ద‌ కొని అంతర్జాతీయ మార్కెట్ లో అమ్మేస్తోంది. అక్క‌డి కొలగచ్చియా ప్రాంతంలోని పుర్బాషా వృద్ధాశ్రమంలో విదేశాల‌కు త‌ర‌లించ‌డానికి సిద్ధం చేసిన పదిమంది శిశువులను సీఐడీ పోలీసులు ర‌క్షించారు. మ‌రో దారుణం ఏంటంటే, అదే ఆశ్ర‌మంలో ఇద్దరు శిశువుల మృతదేహాలు కూడా క‌నిపించాయి. శిశువుల మృదేహాల‌ను కూడా స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు. ఈ కేసులో ఆరా తీస్తోన్న పోలీసుల‌కి షాకింగ్ విష‌యాలు తెలిశాయి. అదే ఆశ్రమం కేంద్రంగా ఇప్పటివరకు 50 మందికి పైగా శిశువులను వీరు అమ్మేశార‌ని స్ప‌ష్ట‌మైంది. మచ్ లాందాపూర్ ప్రాంతంలోని సుజిత్ మోమోరియల్ ట్రస్టు ఈ కార్య‌క్ర‌మాల‌కు కేంద్రంగా మారింద‌ని తేల్చారు. ప‌సికందులను అక్రమంగా త‌ర‌లిస్తోన్న క్ర‌మంలో ప‌లువురు శిశువులు ప్రాణాలు కోల్పోయార‌ని తెలిసింది. ఈ దారుణానికి పాల్ప‌డుతున్న‌ ముఠా స‌భ్యుల‌కి ప‌లు ఆసుపత్రులు, క్లినిక్ లు, స్వచ్ఛందసంస్థల స‌హ‌కారం ఉంద‌ని పోలీసులు తేల్చారు. ఆశ్ర‌మం నుంచి యూరోలు, హాంగ్ కాంగ్ డాలర్లు, బంగారు బిస్కెట్లతో పాటు కొంత న‌గ‌దును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. న‌గ‌రానికి చెందిన పార్థా చటర్జీ అనే ఓ ఆసుపత్రి యజమానిని అరెస్టు చేశారు. కేసులో నిందితులుగా పుతుల్ బెనర్జీ, రీనా బెనర్జీ అనే వ్య‌క్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటువంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని ప‌శ్చిమ‌బెంగాల్ ప్ర‌భుత్వం హెచ్చరించింది.

  • Loading...

More Telugu News