: పాక్ కు షాకిచ్చిన మోదీ... ఒక్క చుక్క నీటిని కూడా పాక్ కు వదలమంటూ హెచ్చరిక
పాకిస్థాన్ కు భారత ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద షాక్ ఇచ్చారు. పాక్ కు జీవనాధారమైన సింధు నది జలాలను ఒక్క చుక్క కూడా ఆ దేశానికి వదలమని స్పష్టం చేశారు. మన దేశం నుంచి పాక్ వెళుతున్న జలాలను పూర్తిగా ఉపయోగించుకునే హక్కు ఉందని ప్రధాని తెలిపారు. సింధూ జలాలు భారత హక్కు... కానీ, పాకిస్థాన్ కు ఆ జలాలన్నీ వెళ్లిపోతున్నాయని చెప్పారు. ఈ రోజు పంజాబ్ లోని భటిండాలో ఎయిమ్స్ శంకుస్థాపన సందర్భంగా మోదీ బహిరంగసభలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. "మన దేశం నుంచి వెళుతున్న సింధు నదీ జలాలు పాక్ గుండా వెళ్లి సముద్రంలో కలుస్తున్నాయి. ఆ నీళ్లను మన రైతులకు అందించే ప్రయత్నం చేస్తాం. ఆ నీళ్లను ఒక్క చుక్క కూడా పాక్ కు వెళ్లకుండా చేస్తాం" అని మోదీ అన్నారు. 1960లో జరిగిన 'ఇండస్ ఒప్పందం' ప్రకారం రావి, బియాస్, సట్లెజ్ నదులు భారత్ కు... ఇండస్ (సింధు), జీలం, చీనాబ్ నదులు పాక్ కు దక్కాయి. ఈ అంశానికి సంబంధించి ఇరు దేశాల అధికారులూ ఉన్న 'ఇండస్ వాటర్ కమిషన్'ను సస్పెండ్ చేయాలని మోదీ భావిస్తున్నారు. ఈ నదులన్నీ భారత్ మీదుగా పాకిస్థాన్ లోకి ప్రవేశిస్తున్నవే. మోదీ ఈ విషయంపై స్పష్టంగా మాట్లాడటంతో పాకిస్థాన్ లో అలజడి రేగింది. నిజంగా ఇదే జరిగితే... పాక్ లోని సారవంతమైన భూములన్నీ బీడుగా మారతాయి. అసలే పాకిస్థాన్ ఆర్థిక స్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. వారికి నీరు లేకపోతే అక్కడ పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది.