: మరో ఐదు నెలలపాటు కరెన్సీ కష్టాలు: బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా స్పష్టీకరణ
మరో ఐదు నెలలపాటు దేశ ప్రజలను కరెన్సీ కష్టాలు వీడే అవకాశం లేదని బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు స్పష్టం చేశారు. హైదరాబాదులో ఆ యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ, ఆర్బీఐ విధానాలు దారుణంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో 85 శాతం మంది ప్రజలు పబ్లిక్ సెక్టార్ బ్యాంకింగ్స్ లో ఖాతాదారులుగా ఉన్నారని చెప్పారు. కేవలం 14 శాతం మంది ప్రైవేటు బ్యాంకుల్లో ఖాతాదారులుగా ఉన్నారని అన్నారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ వేల కోట్ల రూపాయలను ప్రైవేటు సెక్టార్ బ్యాంకుల్లో జమ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు డబ్బులు అవసరం మేరకు ఇవ్వడం లేదని చెప్పారు. దేశవ్యాప్తంగా ఆర్బీఐకి నాలుగు కరెన్సీ ముద్రణాలయాలున్నాయని చెప్పారు. ఈ నాలుగు ముద్రణాలయాల్లో నిర్విరామంగా డబ్బులు ముద్రిస్తే ఆరు నుంచి ఏడునెలల్లో నగదు సమస్య తీరదని చెప్పారు. కేంద్రం, ఆర్బీఐ ఉమ్మడిగా అబద్ధాలు చెబుతున్నాయని బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలో 6 లక్షల జన్ ధన్ ఖాతాలు ఉంటే...ఆరేడు నెలలుగా పైసా లేని ఖాతాలు డబ్బులతో కళకళలాడుతున్నాయని తెలిపారు. ఈ ఖాతాల ద్వారా 3 వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని...ఈ డబ్బు ఎవరిదని ఇప్పుడు వివరాలు సిద్ధం చేసి, ఇన్ కం ట్యాక్స్ ఇతర శాఖలకు పంపాల్సి ఉందని, దీంతో ఆ ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కోవాలని వారు పేర్కొన్నారు. ఇంత విపరీత పరిస్థితులను ఎందుకు కల్పించారు? దీనంతటికీ కారణం ఎవరు? ఇలాంటి సమస్యలపై పరిష్కారాలు ఏంటి? అని వారు అడిగారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక బ్యాంకు ఉద్యోగులు, అధికారులు ప్రాణాలు కోల్పోతున్నారని వారు మండిపడ్డారు.