: నాగార్జున 'ఓం నమో వేంకటేశాయ' సీన్స్ కూడా లీక్!
'బాహుబలి - ది కన్ క్లూజన్' సినిమా క్లిప్పింగ్స్ చోరీ చేసి షేర్ చేసుకున్న వారిని అరెస్ట్ చేసిన పోలీసులు మరో కీలక విషయాన్ని గుర్తించారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రూపొందిస్తున్న నాగార్జున చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'కు చెందిన కొన్ని సీన్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఈ విషయాన్ని విజయవాడ ఏసీపీలు సత్యానందం, మురళీధర్ లు వెల్లడించారు. అయితే, నిందితులు వీటిని ఎవరికీ షేర్ చేయలేదని పోలీసులు చెబుతుండటం గమనార్హం. 'ఓం నమో వేంకటేశాయ' సీన్లను ఎక్కడి నుంచి తెచ్చారన్న విషయం తెలియాల్సివుంది. బాహుబలి చిత్రానికి ఎడిటింగ్ పనులు చూసేందుకు నియమించబడ్డ కృష్ణచైతన్య, కొన్ని క్లిప్పింగ్స్ దొంగిలించి, తన స్నేహితులకు పంపగా, వారు తమ స్నేహితులకు వాటిని పంపారు. ఈ కేసులో ఆరుగురు విద్యార్థులను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.