: పాక్‌పై భారత్ ప్రతీకారం.. 9 మంది పాక్ సైనికులు హతం
పాక్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని పాక్ పోస్టులపై భీకర కాల్పులతో పాక్ వెన్నులో వణుకు పుట్టించింది. 120 ఎంఎం మోర్టార్లు, మిషన్ గన్లతో పాక్ జవాన్లను బెంబేలెత్తించింది. భారత్ దళాల దాడుల్లో 9 మంది పాక్ జవాన్లు హతమయ్యారు. వీరిలో కెప్టెన్‌స్థాయి అధికారి కూడా ఉన్నారు. మంగళవారం జమ్ముకశ్మీర్‌లోని మచ్చల్ సెక్టార్‌లో పాక్ దళాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారం తీవ్రంగా ఉంటుందని భారత్ అప్పుడే హెచ్చరించింది. అనుకున్నట్టుగానే పాక్ పోస్టులపై భీకర కాల్పులతో విరుచుకుపడింది. భారత్ ఆర్మీ దాడిలో 9 మంది పాక్ సైనికులు హతమైనట్టు తెలుస్తోంది. అయితే భారత్ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు, మరో పదిమంది పౌరులు మరణించారని పాక్ ప్రకటించింది. భారత్ ప్రయోగించిన ఓ షెల్ ప్రైవేటు బస్సు, అంబులెన్స్‌పై పడిందని, దీంతో పదిమంది పౌరులు మృతి చెందారని పేర్కొంది. తమవైపు నుంచి ఎటువంటి కవ్వింపు చర్యలు లేకుండానే భారత్ కాల్పులకు పాల్పడిందని ఆరోపించింది. భారత్ కాల్పులను సమర్థంగా తిప్పికొట్టామని, తమ దాడుల్లో ఏడుగురు భారత సైనికులు మృతి చెందారని పాక్ ప్రకటించింది. అయితే భారత్ ఆర్మీ దీనిని ధ్రవీకరించలేదు. మరోవైపు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా భారత్‌పై ఆరోపణలు గుప్పించారు. భారత్ ఏకపక్షంగా కాల్పులకు దిగిందని, కాల్పుల ఉల్లంఘనకు ఇదో నిదర్శనమని అన్నారు. మంగళవారం మచ్చల్ సెక్టార్‌లో పాక్ జరిపిన కాల్పుల్లో అమరులైన జవాన్లు మనోజ్ కుమార్ కుశ్వాహ, ప్రభుసింగ్, శశాంక్ కుమార్‌లకు సైన్యం నివాళులు అర్పించింది.