: సరిహద్దు ప్రాంతాల్లో కాల్పుల మోత.. భారత్ తమ పౌరుల ప్రాణాలు తీసిందని పాకిస్థాన్ ఆరోపణ!
సరిహద్దు ప్రాంతాల్లో నిన్న పాక్ బలగాలు దాడి జరిపి ముగ్గురు భారత సైనికుల ప్రాణాలను బలిగొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత జవాన్లు దీటైన సమాధానం ఇస్తున్నారు. అయితే, భారత్‌పై పాకిస్థాన్ పలు ఆరోపణలు గుప్పిస్తోంది. భారత బలగాలు జరుపుతున్న కాల్పుల్లో 11 మంది తమ పౌరులు ప్రాణాలు కోల్పోయారని పాకిస్థాన్ పేర్కొంటుంది. భారత జవాన్లు నీలం వ్యాలీలో ఓ బస్సుపై దాడి చేశారని ఈ ఘటనలో తొమ్మిది మంది చనిపోయారని, అంతేగాక పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) లోని నాక్యాల్ ప్రాంతంలో భారత బలగాలు జరిపిన కాల్పుల్లో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని పాకిస్థాన్ అధికారులు ఆరోపిస్తున్నారు. నిన్న పాకిస్థాన్ బలగాలు చేసిన దుశ్చర్య పట్ల స్పందించిన భారత సైనిక అధికార ప్రతినిధి కల్నల్ నితిన్ జోషి మాట్లాడుతూ... ఈ రోజు ఉదయం నుంచి పాక్ బలగాలు కశ్మీర్ లోని భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మరోసారి కాల్పులు జరిపాయని చెప్పారు. భారత్, పాక్ పరస్పరం జరుపుతున్న కాల్పులతో సరిహద్దు ప్రాంతాలు కాల్పుల మోతతో దద్దరిల్లిపోతున్నాయి.