: 'అదిగో'... దర్శకుడు రవిబాబు చంకలో పందిపిల్లను పెట్టుకొని ఏటీఎం ముందు క్యూలో నిలబడ్డాడు!
సినిమాలను సెపరేటు రూటులో ప్రచారం చేసుకునే బాలీవుడ్ అడుగుజాడల్లోనే టాలీవుడ్ ప్రముఖులు కూడా నడవడానికి మక్కువ చూపిస్తున్నారు. జనాలు రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లి డ్యాన్సులు వేయడం, విచిత్ర వేషధారణతో ప్రజల దృష్టిని ఆకర్షించడం, కాలేజీల్లో ప్రోగ్రాంలు నిర్వహించడం, సినిమాలో వేసిన వేషాన్ని ధరించి ప్రజల ముందు ప్రత్యక్షమవడం వంటివి చేస్తూ బాలీవుడ్ నటులు వారి సినిమాను ప్రచారం చేసుకుంటారు. ఇప్పుడు తెలుగు సినిమా నిర్మాత, దర్శకుడు, నటుడు రవిబాబు కూడా అటువంటి ప్రయోగమే చేశాడు. తక్కు బడ్జెట్తో సినిమాలు తీస్తూ మంచి విజయాలు అందుకుంటున్న రవిబాబు ఇప్పుడు పంది పిల్ల లీడ్ రోల్లో పెట్టి 'అదిగో' అనే టైటిల్ తో ఓ సినిమాను తీస్తున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఆ సినిమాను ప్రచారం చేసుకునే పనిలో రవిబాబు పడ్డాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రజలు బ్యాంకులు, ఏటీయంల ముందు క్యూ కడుతూ కనపడుతున్న విషయం తెలిసిందే. ఏ వార్తా ఛానెల్లో చూసినా, ఏ పత్రికలో చూసినా మొత్తం బ్యాంకుల ముందు క్యూ కడుతూ ప్రజలు పడుతున్న ఇబ్బందులపైనే న్యూస్ వస్తుండడాన్ని గమనించిన రవిబాబు అవే ఏటీఎంల ముందు తన సినిమా ప్రచారం చేపట్టాలని తన సినిమా హీరో పందిపిల్లతో కలిసి ఏటీయం క్యూ లైన్లో నిలబడి కనిపించాడు. రవిబాబు క్యూ లైన్లో కనిపిస్తేనే అది వార్తగా మారిపోతుంది. అలాంటిది, ప్రేక్షకులను మరింత ఆకర్షించేందుకు చంకలో పంది పిల్లతో ఆయన ఏటీఎం ముందు క్యూలో నిలబడడం అందరినీ ఆకర్షిస్తోంది.