: పెళ్లి చేసుకుందాం, పిల్లల్ని కందామని ఆమెకు రాహుల్ గాంధీ చెప్పాడట.. కలలోనే సుమా!
మన దేశంలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ లో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తొలి స్థానంలో నిలుస్తారు. ఆయన ఓకే అంటే పెళ్లి చేసుకోవడానికి సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఎందరో క్యూ కడతారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ కు చెందిన ఓ మహిళ రాహుల్ కు ఇలాంటి ప్రపోజలే చేసింది. అలహాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు ఏకంగా ఓ ప్రెస్ మీటి పెట్టి తన మనసులోని భావాలను, ఆశలను బహిర్గతం చేసింది. రాహుల్ తనను ఎందుకు పెళ్లి చేసుకోవచ్చో కూడా వివరంగా తెలిపింది. రాహుల్ చాలా మంచి వాడని, దళితులతో కలసి భోజనం చేస్తాడని, దళితులకు సహాయం చేస్తాడని, దళితులను పెళ్లి కూడా చేసుకుంటాడని ఆమె తెలిపింది. తాను ఓబీసీ వర్గానికి చెందిన దాన్నని... రాహుల్ పార్టీ (కాంగ్రెస్)లో కూడా పనిచేస్తున్నానని... ఈ నేపథ్యంలో, ఆయన తనను ఎందుకు పెళ్లి చేసుకోకూడదని ప్రశ్నించింది. కాంగ్రెస్ పార్టీ సేవా దళ్ విభాగంలో పని చేస్తున్న ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాహుల్ ను పెళ్లాడాలన్న కోరిక తనకు 2006 నుంచి ఉందని చెప్పింది. రాహుల్ మీద అప్పట్లో తనకు కొంచెం నమ్మకముండేదని... 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తన అభిప్రాయంలో కొంచెం తేడా వచ్చిందని తెలిపింది. రాహుల్ మంచివాడని, ప్రధానమంత్రి కుమారుడని, మంచి నాయకుడని ఈ సందర్భంగా ఆమె ప్రశంసించింది. పార్టీ కార్యాక్రమాల సందర్భంగా రాహుల్ ను చాలా సార్లు కలిశానని... ఆ సందర్భాల్లో రాహుల్ కు, తనకు మధ్య ఎంతో సామీప్యత ఉన్నట్టు అనిపించేదని చెప్పింది. మరి పెళ్లి గురించి రాహుల్ నుంచి ఏమైనా హామీ లభించిందా? అన్న ప్రశ్నకు బదులుగా... వాస్తవంలో ఎలాంటి హామీ లభించలేదని, కానీ తన కలలలో మాత్రం పెళ్లి చేసుకుందామని, కలసి పిల్లల్ని కందామని రాహుల్ చెప్పారని తెలిపింది. మరి, ఈమె ఆశలపై రాహుల్ గాంధీ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.