: కేసీఆర్ కోసం బులెట్ ప్రూఫ్ బాత్ రూమ్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం బేగంపేటలో సిద్ధమవుతున్న కొత్త బంగళా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ భవంతిలో తాను వినియోగించే బాత్ రూమ్ ను సైతం బులెట్ ఫ్రూఫ్ గా కేసీఆర్ తయారు చేయించుకున్నారు. ఎటువంటి బులెట్లు తగిలినా చెక్కు చెదరని అద్దాలతో ఈ బాత్ రూం నిర్మితమైనట్టు తెలుస్తోంది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వచ్చిన సూచనల మేరకు సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ వినియోగించే రెండు పడక గదులను సైతం హై క్వాలిటీ గ్లాస్ తో ఫిట్ చేశారని తెలుస్తోంది. ఇక అత్యాధునిక ఆయుధాలను చేతుల్లో కలిగుండే భద్రతా దళాలు, మందుపాతరలతో పేల్చినా ప్రమాదం జరగని కార్లు, జడ్ ప్లస్ సెక్యూరిటీని ఆయనకు కల్పించనున్నారు. మొత్తం లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమైన భవంతిలో వెంటిలేటర్లు, కిటికీలు సహా అన్ని అద్దాలనూ కోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేశారు. కాగా, రేపు కేసీఆర్ ఈ కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేస్తారని, కనీసం 50 మంది భద్రతా సిబ్బంది అనునిత్యమూ భవంతిని పహారా కాస్తుంటారని, ఐఎస్ డబ్ల్యూ (ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్) సభ్యులు పర్యవేక్షిస్తుంటారని అధికారులు తెలిపారు. ఇక ఆయన్ను కలవాలని వెళితే, ఎవరికైనా సోదాలు తప్పనిసరి. ఆపై ఫోన్, వాచ్, పర్స్ వంటి అన్ని వస్తువులనూ సరెండర్ చేయాల్సిందేనని తెలుస్తోంది. సుదూర ప్రాంతం నుంచి స్నిప్పర్ రైఫిల్ ద్వారా వచ్చే బులెట్లను అడ్డుకునేందుకే బులెట్ ప్రూఫ్ గ్లాస్ లను ఏర్పాటు చేయాలని నిఘా వర్గాలు సూచించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News