: అభిమానిని చితగ్గొట్టిన పాప్ స్టార్... నోటి నుంచి రక్తం కారేలా పంచ్ ఇచ్చాడు
చిన్న వయసులోనే పాప్ స్టార్ గా పేరు ప్రఖ్యాతులతో పాటు, భారీ ఆదాయాన్ని పొందుతున్న జస్టిన్ బీబర్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో సహవాసం చేస్తూనే ఉంటాడు. తాజాగా, బార్సిలోనాలో షో చేయడానికి వెళ్లిన బీబర్ ను ఓ అభిమాన తాకే ప్రయత్నం చేశాడు. షో కోసం కారులో బయలుదేరిన బీబర్ ను చూసిన సదరు అభిమాని, కారును వెంబడించి అతన్ని తాకబోయాడు. దీంతో, ఆగ్రహంతో ఊగిపోయిన బీబర్... అభిమాని ముఖంపై పిడిగుద్దు విసిరాడు. ఈ ఘటనతో, అభిమానితో పాటు, రోడ్డు పక్కనే ఉన్నవారు సైతం షాక్ కు గురయ్యారు. బీబర్ విసిరిన పిడిగుద్దు అతని పెదాలకు బలంగా తాకడంతో, పెదవి చిట్లడమే కాకుండా, నోటి నుంచి రక్తం కారింది. ఈ ఘటనను అక్కడి మీడియా చిత్రీకరించింది. జరిగిన ఘటనపై బీబర్ ప్రతినిధి స్పందించాడు. షోకు వెళ్లే ముందు అభిమానులతో బీబర్ మాట్లాడాడని... ఫొటోలు, ఆటోగ్రాఫ్ ల కోసం అభిమానులు అడగ్గా, అవి తనకు నచ్చవంటూ సున్నితంగా తిరస్కరించాడని చెప్పాడు. అక్కడ నుంచి బీబర్ బయలుదేరిన తర్వాత కూడా... ఓ అభిమాని కారును వెంటాడి వేధించాడని తెలిపాడు.