: 'పెద్ద నోట్ల రద్దు' ఆందోళన.. మోదీకి వ్యతిరేకంగా కలిసిన 13 పార్టీలు
పెద్ద నోట్ల రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న 13 ప్రతిపక్ష పార్టీలు, ప్రధానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపేందుకు నిర్ణయించాయి. ఇందులో భాగంగా ఈ ఉదయం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టనున్నట్టు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. ప్రజల ఇబ్బందులను తక్షణం తొలగించాలని తాము కోరుతుంటే, ప్రభుత్వం ఎంత మాత్రమూ స్పందించడం లేదని ఆమె ఆరోపించారు. నేటి మధ్యాహ్నం జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నాను నిర్వహించనున్నామని, ఆపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి, నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆయనకు తెలియజేస్తామని మమత పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రపతికి మెమొరాండం సమర్పించనున్నట్టు వివరించారు. కాగా, ఈ ధర్నాలో కాంగ్రెస్, సమాజ్ వాదీ, సీపీఐ, సీపీఎం సహా పలు పార్టీలు భాగం పంచుకోనున్నాయి.