: సీజ్ చేసిన రూ.3.5 కోట్లు గల్లంతు.. తలలు పట్టుకున్న ఐటీ అధికారులు
నాగాలాండ్‌లోని దిమాపూర్ లో ఓ ప్రైవేటు చార్టర్డ్ విమానం నుంచి స్వాధీనం చేసుకున్న రూ.3.5 కోట్ల విలువైన పాత రూ.500, రూ.1000 నోట్లు మాయమయ్యాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో సమాచారం మేరకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) అధికారులు దాడులు నిర్వహించి ఈ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. పెద్ద మొత్తంలో పాత నోట్లను స్వాధీనం చేసుకున్నట్టు సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులకు సమాచారం అందించిన కాసేపటికే స్వాధీనం చేసుకున్న సొమ్ము మాయమైంది. అయితే ఆ సొమ్ము సీఐఎస్ఎఫ్ సిబ్బంది వద్దే ఉండి ఉండొచ్చని స్థానిక ఇన్‌కం ట్యాక్స్ అధికారి తెలిపారు. అనుమానితులను అరెస్ట్ చేసే అధికారం తమకు లేకపోవడంతో విషయాన్ని సీఐఎస్ఎఫ్ అధికారులు వెంటనే సమాచారాన్ని ఇంటెలిజెన్స్ బ్యూరో, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్‌కు తెలిపారు. సొమ్ము తరలిస్తున్న విమానంలో ఉన్న వ్యక్తిని బీహార్ వ్యాపార వేత్త అమర్‌జిత్ కుమార్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు. ఢిల్లీలోని నాగాలాండ్ వ్యాపారవేత్తకు అందించేందుకే ఈ నగదును తరలిస్తున్నట్టు అమర్‌జీత్ సీఐఎస్ఎఫ్ అధికారులకు తెలిపారు.