: కొత్త ఇంట్లోకి కేసీఆర్.. రేపే గృహప్రవేశం
గురువారం తెల్లవారుజామున 5 గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నూతన గృహప్రవేశం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బేగంపేటలో ప్రస్తుతం ఉన్న సీఎం క్యాంపు కార్యాలయం వెనక 9 ఎకరాల విస్తీర్ణంలో ముఖ్యమంత్రి కొత్త క్యాంపు ఆఫీసు, నివాస భవనం, ప్రత్యేక మీటింగ్ హాల్ నిర్మించారు. ఇందుకోసం ఆర్అండ్‌బీ రూ.38 కోట్లు ఖర్చు చేసింది. ఒకేసారి వందమందితో సమావేశమయ్యేలా మీటింగ్ హాల్ నిర్మించారు. ముఖ్యమంత్రి సూచన మేరకు వివిధ రకాల మొక్కలు సేకరించి ప్రాంగణంలో నాటారు. నిర్మాణ పనులు ప్రారంభించిన 9 నెలల్లోనే పనులు పూర్తి చేయడం విశేషం. మూడు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ తిరిగి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సాయంత్రం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలిసి గృహప్రవేశానికి ఆహ్వానించారు.