: కలకలం రేపుతున్న రెండు వేల రూపాయల నకిలీ నోట్లు
నకిలీ నోట్లను అరికట్టడానికి ఎన్నో కట్టుదిట్టమైన ఫీచర్లతో తీసుకొచ్చిన కొత్త 2000 రూపాయల నోటుకు కూడా నకిలీ నోట్లను ముద్రిస్తూ కేటుగాళ్లు కలకలం సృష్టిస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల రూ.2000 వేల రూపాయల నకిలీ నోట్లు దర్శనమిచ్చాయి. తాజాగా గుంటూరు జిల్లాలోని వినుకొండ లాయర్స్ కాలనీ మీసేవా కేంద్రంలో ఈ రోజు ఉదయం నకిలీ నోటు బయటపడింది. సదరు మీ సేవ కేంద్రంలో కట్టిన బిల్లులను లెక్కిస్తుండగా నకిలీ నోటు కనిపించింది. ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. కొత్త రూ.2000 నోటు నకిలీదో.. అసలైనదో తెలుసుకునేందుకు కావాల్సిన అవగాహన ప్రజల్లో పూర్తిస్థాయిలో ఇంకా కలగలేదు. పాకిస్థాన్ కూడా తలలుబద్దలు కొట్టుకున్నా మనం తీసుకొచ్చిన కొత్త నోటుకు నకిలీ తీసుకురాలేదని భావించిన ప్రజలకు, మీసేవ కేంద్ర ఉద్యోగుల లాంటి వారికి ఇప్పుడు నకిలీ ఏదో, ఒరిజినల్ ఏదో తెలుసుకోవడం కష్టంగా మారింది.