: మసీదులో అజాన్ విని... చీర కొంగు కప్పుకున్న సోనియాగాంధీ
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, ముఖ్య నేతలంతా ఎన్నికల ప్రచారంపై దృష్టిని సారించారు. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వీరంతా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ యూపీ రాజధాని లక్నోలో ఓ బహిరంగసభలో ప్రసంగించారు. ఈ సమయంలో పక్కనే ఉన్న మసీదు నుంచి అజాన్ వినిపించింది. వెంటనే తన ప్రసంగాన్ని ఆపివేసిన సోనియాగాంధీ... తలపై చీర కొంగును కప్పుకున్నారు. అజాన్ పూర్తయిన తర్వాత తన ప్రసంగాన్ని కొనసాగించారు. ముస్లిం ఓటర్లను ఆకట్టుకోవడానికే సోనియా ఇలా చేశారని కొందరు వ్యాఖ్యానించారు. యూపీలో 30 శాతం మంది ముస్లింలు ఉన్నారు. అక్కడి ఎన్నికల్లో పార్టీల గెలుపు ఓటములను వీరు ప్రభావితం చేస్తుంటారు.