: మోదీ టీవీల్లోను, పాప్ సంగీత కచేరీల్లోనూ మాట్లాడతారు.. మరి పార్లమెంటులో మాట్లాడరా?: రాహుల్‌గాంధీ
పెద్దనోట్లను రద్దు చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్లమెంటులో ఈ అంశంపై మాట్లాడకపోవడంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ టీవీల్లో, పాప్ సంగీత కచేరీల్లో మాట్లాడతారని, మరి పార్లమెంటులో మాట్లాడరా? అని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంటులో కాకుండా వేరే వేదికలపై మాట్లాడుతూ ప్రధాని మోదీ పెద్దనోట్ల అంశంపై మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన అన్నారు. బ్యాంకులు, ఏటీఎంల వద్దకు వెళ్లి అక్కడ ప్రజలు ఎదుర్కుంటున్న ఇబ్బందులను తెలుసుకుంటున్న రాహుల్ గాంధీ.. దేశంలో నగదు కొరతపై ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజ్యసభలో పెద్దనోట్ల రద్దుపై సమాధానం చెప్పాలని విపక్ష నేతలు ఛైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టడంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ప్రకటించారు.