: కలిసొచ్చిన నోట్ల రద్దు.. ఒక్క రోజులోనే రూ.120 కోట్ల లావాదేవీలు జరిపిన పేటీఎం
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ పేటీఎంకు నోట్ల రద్దు కలిసొచ్చింది. చేతిలో డబ్బులు లేక, ఉన్న నోట్లు చెల్లక ఇబ్బందులు పడుతున్న జనం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. నగదు రహిత లావాదేవీలపై దృష్టి సారించారు. ఈ క్రమంలో చాలామంది తమ లావాదేవీలకు పేటీఎంను ఉపయోగించుకున్నారు. పెద్దనోట్లు రద్దు చేసిన తర్వాత ఒక్క రోజులోనే ఈ సంస్థ 120 కోట్ల రూపాయల విలువైన ఏడు మిలియన్ లావాదేవీలు నిర్వహించడం గమనార్హం. పెద్ద నోట్ల రద్దు తర్వాత గత పది రోజుల్లో 45 మిలియన్ల మంది వినియోగదారులకు సేవలు అందించినట్టు పేటీఎం తెలిపింది. వీరిలో ఐదు మిలియన్ల మంది కొత్తగా చేరిన వారేనని పేర్కొంది. పేటీఎం పట్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని చెప్పడానికి ఇది ఉదాహరణ అని సంతోషం వ్యక్తం చేసింది. మెట్రో నగరాల్లో కాఫీకి కూడా పేటీఎం ద్వారానే చెల్లింపులు జరిగాయని పేర్కొంది. అలాగే కర్నూలులో ఓ రైతు విత్తనాలు కొనేందుకు పేటీఎంను వాడుకున్నట్టు సంస్థ ఉపాధ్యక్షుడు సుధాంశు గుప్తా తెలిపారు.