: 4 శతాబ్దాల క్రితమే కృత్రిమ దంతాలు.. తవ్వకాల్లో బయపడిన వైనం!
దంతవైద్య శాస్త్రం నాలుగు వందల ఏళ్ల క్రితమే అభివృద్ధి చెందినట్టు తెలిపే బలమైన ఆధారం ఒకటి తవ్వకాల్లో బయటపడింది. ఇటలీలోని టుస్కాన్ వద్ద పురాతత్వ శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో బంగారం రేకుతో ఉన్న కృత్రిమ దంతాలు బయటపడ్డాయి. ఐదు పళ్లు కలిగిన పై దవడను గుర్తించిన శాస్త్రవేత్తలు అది 4 శతాబ్దాల నాటిదని తేల్చారు. దంతాలకు బంగారు రేకు ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయినట్టు తెలిపారు. దొరికిన దవడను పరిశీలించగా చాలా నేర్పరితనం కనిపించిందని పిసీ యూనివర్సిటీకి చెందిన సిమోనా, వాలెంటినా తెలిపారు. కృత్రిమ దంతాలకు తొడిగిన బంగారం రేకులో 73 శాతం బంగారం, 15.6 శాతం వెండి, 11.4 శాతం రాగి వున్నాయని వివరించారు. ప్రతి పన్నుకు సూక్ష్మ రూపంలో బంగారు పిన్నులు ఉన్నట్టు సీటీ స్కానింగ్‌లో వెల్డడైందన్నారు. కోల్పోయిన పళ్ల స్థానంలో కృత్రిమ దంతాలను ఎంతో నైపుణ్యంతో అమర్చినట్టు తెలుస్తోందని శాస్త్రవేత్తలు వివరించారు.