: జపాన్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
జపాన్ను ఈ తెల్లవారుజామున భారీ భూకంపం వణికించింది. ఉత్తర జపాన్లో స్థానిక కాలమానం ప్రకారం ఈ తెల్లవారుజామున 5:59 గంటలకు 6.9 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. సునామీ వచ్చే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ జపాన్ వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. భూకంప కేంద్రం టోక్యోలో ఉన్నట్టు గుర్తించామని, భూమికి 10 కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రాణ, ఆస్తినష్టంపై ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేదు. భూకంపం కారణంగా ఫుకుషిమాలో ఉన్న అణు విద్యుత్ కేంద్రాలకు ఏమైనా నష్టం వాటిల్లిందేమోనని టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ పరిశీలిస్తోంది. మార్చి 2011లో జపాన్ను సునామీ కుదిపేసిన సంగతి తెలిసిందే. జపాన్లో భూకంపాలు సర్వసాధారణమైన విషయం. ప్రపంచవ్యాప్తంగా సంభవించే భూకంపాల్లో 20శాతం ఇక్కడే ఏర్పడుతుండడం గమనార్హం. మార్చి 2011లో 9.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. జపాన్ చరిత్రలో ఇదే అతి భయంకరమైన భూకంపం. ఈ భూకంపం సమయంలోనే ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రం ధ్వంసమైంది.