: పెద్దనోట్ల రద్దు ప్రభావం: 300 రూపాయల కోసం గొడవ.. గొంతు కోసేసిన వైనం
దేశ ప్రజలపై పెద్దనోట్ల రద్దు ప్రభావం తీవ్రంగా పడింది. చేతిలో చిల్లర డబ్బులు లేకపోవడంతో నిత్యావసర సరుకులను కొనుక్కోలేక విచక్షణ కోల్పోతున్నారు. పెద్దనోట్ల రద్దుపై అసహనంతో ఉన్న ఓ వ్యక్తి తాజాగా ముంబయి నగరంలోని సేవక్ నగర్‌లో దారుణానికి పాల్పడ్డాడు. ఆ ప్రాంతానికి చెందిన ఇష్రాద్ అలీ వద్ద ఆయన పక్కింట్లో నివాసం ఉంటున్న షమీమ్ అఖ్తర్ కొన్ని రోజుల క్రితం 300 రూపాయలు అప్పుగా తీసుకొని తరువాత ఇచ్చేస్తానని చెప్పాడు. ప్రస్తుతం దేశంలో చిల్లర నోట్లు దొరకక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాను అప్పుగా ఇచ్చిన డబ్బుని వెంటనే ఇచ్చేయాలంటూ షమీమ్‌ను ఇష్రాద్ అడిగాడు. పెద్దనోట్ల రద్దు తరువాత తన వద్ద వంద, యాభై నోట్లు లేవని, ఇప్పుడు డబ్బు ఇవ్వలేనని షమీమ్ చెప్పాడు. మద్యం మత్తులో ఉన్న ఇష్రాద్ ఆగ్రహం తెచ్చుకుని కత్తితో షమీమ్ గొంతు కోశాడు. షమీమ్‌ని స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. చిల్లర దొరక్క చికాకులో ఉండడంతోనే తాను ఆవేశంలో గొంతుకోశానని నిందితుడు చెప్పాడు.