: పాక్ ఆర్మీ చీఫ్ ‘ఫేర్ వెల్ టూర్’ ప్రారంభం
ఈ నెల 29తో పాకిస్తాన్ పవర్ ఫుల్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ‘ఫేర్ వెల్ టూర్’ను లాహోర్ నుంచి ఈరోజు ప్రారంభించారు. ఈ విషయాన్ని మిలిటరీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అసీమ్ బజ్వా తన ట్విట్టర్ ఖాతా ద్వారా పేర్కొన్నారు. ఈ ‘ఫేర్ వెల్ టూర్’లో భాగంగా సైనికులను రహీల్ షరీఫ్ కలుస్తారన్నారు. రహీల్ షరీఫ్ పదవీకాలం పొడిగించారంటూ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని ఈ సందర్భంగా ఆ ట్వీట్ లో స్పష్టం చేశారు. కాగా, మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగిన రహీల్ షరీఫ్ కు ప్రజలలో మంచి పేరు ఉంది. నేరాలు, అవినీతిని అదుపులో వుంచడంలోను, గిరిజన ప్రాంతాల్లో అస్థిరతకు కారణమైన ఇస్లామిక్ ఉగ్రవాదులపై పోరాటం చేయడంలోను రహీల్ షరీఫ్ దిట్ట. ఇదిలా ఉండగా, రహీల్ షరీఫ్ స్థానంలో ఆర్మీచీఫ్ ను నియమించేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ నెల 28వ తేదీ నాటికి ఆ పదవికి తగిన వ్యక్తుల పేర్లను సూచించాలని సంబంధిత అధికారులను పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇప్పటికే కోరారు. పాక్ ఆర్మీ చీఫ్ పదవికి నాలుగు పేర్లను అధికారులు సూచించారు. అందులో లెఫ్టినెంట్ జనరల్ జావేద్ ఇక్బాల్ రమడే, లెఫ్టినెంట్ జనరల్ జుబేర్ హయత్, లెఫ్టినెంట్ జనరల్ ఇష్ఫాక్ నదీమ్ అహ్మద్, లెఫ్టినెంట్ జనరల్ కమర్ జావేద్ బజ్వా పేర్లు ఉన్నట్లు సమాచారం.