: ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ వే ప్రారంభం... ఆరు యుద్ధ విమానాలను రోడ్డుపై దింపిన ఎయిర్ ఫోర్స్
దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోల మధ్య నిర్మించిన ఎక్స్ ప్రెస్ వేను ఈ రోజు అట్టహాసంగా ప్రారంభించారు. లక్నోలో ఈ రహదారిని యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ సింగ్ యాదవ్ ప్రారంభించారు. మరోవైపు, అక్కడకు 50 కిలోమీటర్ల దూరంలోని ఉన్నౌవ్ లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత వాయు సేనకు చెందిన ఆరు సుఖోయ్, మిరాజ్ 2000 యుద్ధ విమానాలు ఎక్స్ ప్రేస్ వేపై ల్యాండ్ అయ్యాయి. మన దేశంలో రోడ్డుపై ఓ యుద్ధ విమానం దిగడం ఇదే ప్రథమం. తొలుత ఓ సుఖోయ్ విమానం ఎక్స్ ప్రెస్ వేపై ల్యాండ్ కావడానికి ప్రయత్నించింది. కానీ, అదే సమయంలో ఒక కుక్క రోడ్డుపైకి రావడంతో, ల్యాండ్ కాకుండానే మళ్లీ గాల్లోకి ఎగిసింది విమానం. అత్యవసర పరిస్థితుల్లో యుద్ధ విమానాలను రహదారిపై ల్యాండ్ చేసే విధంగా హైవేను నిర్మించారు. కేంద్ర రక్షణ శాఖ సూచనల మేరకు ఈ విధంగా నిర్మించారు. 305 కిలో మీటర్ల పొడవున్న ఈ ఎక్స్ ప్రెస్ వేను రికార్ఢు స్థాయిలో కేవలం 23 నెలల్లోనే పూర్తి చేశారు. ఈ రహదారి ద్వారా ఢిల్లీ-లక్నోల మధ్య ప్రయాణ సమయం తొమ్మిది గంటల నుంచి ఐదు గంటలకు తగ్గనుంది. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ కార్యక్రమానికి సమాజ్ వాదీ పార్టీ నేతలంతా హజరయ్యారు. ములాయం కుటుంబంలోని నేతలంతా తమ మధ్య విభేదాలను పక్కన పెట్టి ఐక్యతను చాటే ప్రయత్నం చేశారు.