: విశాఖ టెస్టులో భారత్ ఘన విజయం... భారత బౌలర్ల ధాటికి కుప్పకూలిన ఇంగ్లండ్


విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. 246 పరుగుల తేడాతో కుక్ సేనపై భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో, ఐదు టెస్టుల సిరీస్ లో టీమిండియా 1-0తో ఆధిక్యం సాధించింది. ఇంగ్లండ్ విజయం సాధించాలంటే చివరి రోజున 318 పరుగుల చేయాల్సిన పరిస్థితి. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. కానీ, ఈ రోజు ఆట ప్రారంభమైనప్పటి నుంచి ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ క్రీజులో కుదురుకోలేకపోయారు. వచ్చిన వారు వచ్చినట్టే పెవిలియన్ కు క్యూ కట్టారు. కేవలం నలుగురు బ్యాట్స్ మెన్ మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారంటే విషయం అర్థం చేసుకోవచ్చు. భారత బౌలర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్ లో కేవలం 158 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. మన బౌలర్లలో అశ్విన్, జయంత్ యాదవ్ లు చెరో 3 వికెట్లు పడగొట్టారు. షమీ, జడేజాలు చెరో రెండు వికెట్లు తీశారు. తొలి టెస్టు ఆడుతున్న జయంత్ యాదవ్ చివరి రెండు బంతులకు బ్రాడ్, అండర్సన్ లను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్లలో కుక్ 54, హమీద్ 25, రూట్ 25, డకెట్ 0, మొయిన్ అలీ 2, స్టోక్స్ 6, బెయిర్ స్టో 34, రషీద్ 4, అన్సారీ 0, బ్రాడ్ 5, అండర్సన్ 0 పరుగులు చేశారు. బెయిర్ స్టో నాటౌట్ గా నిలిచాడు. స్కోరు వివరాలు: ఇండియా: 455 & 204 ఇంగ్లండ్: 255 & 158 తొలి ఇన్నింగ్స్ లో 167 పరుగులు, సెకండ్ ఇన్నింగ్స్ లో 81 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు.

  • Loading...

More Telugu News