: పట్టాల పగుళ్లే ప్రమాదానికి కారణం?.. ప్రాథమికంగా నిర్ధారించిన రైల్వే అధికారులు
ఉత్తరప్రదేశ్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రైలు ప్రమాదంపై అధికారులు ఓ అంచనాకు వచ్చారు. ట్రాక్ నిర్వహణ సరిగా లేకపోవడం, పట్టాల పగుళ్ల కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే పూర్తిస్థాయిలో దర్యాప్తు నిర్వహించిన అనంతరం ప్రమాదానికి గల అసలు కారణం తెలుస్తుందన్నారు. కాగా ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 117కు చేరుకుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. 150 మందికిపైగా గాయపడ్డారు. ప్రమాద ఘటనపై స్పందించిన రైల్వే అధికారులు ప్రాథమికంగా దర్యాప్తు నిర్వహించారు. ట్రాక్ నిర్వహణపై దృష్టి సారించకపోవడంతో పట్టాల అడుగున కంకర పేరుకుపోయిందని, సిబ్బంది ఉదాసీనంగా వ్యవహరించడంతో పట్టాలపై పగుళ్లు ఏర్పాడ్డాయని తేల్చారు. ప్రమాదానికి కారణం పగుళ్లేనని నిర్ధారించారు. శతాబ్ది రైళ్లకు వాడుతున్న అధునాతన లింకీ హాఫ్‌మెన్ బుష్ సిస్టం(ఎల్‌హెచ్‌బీ) కోచ్‌లు ఈ రైలుకు కూడా అమర్చి ఉంటే మృతుల సంఖ్య తగ్గే అవకాశం ఉండేదని చెబుతున్నారు. స్టెయిన్‌లెస్ స్టీల్ ఎల్‌హెచ్‌బీ వల్ల ప్రమాద తీవ్ర తగ్గి ఉండేదని అంటున్నారు. ఆ కోచ్‌లలో ఉండే ప్రత్యేక రక్షణ వ్యవస్థ ఒత్తిడిని తట్టుకోగలుగుతుందన్నారు.