: ఇబ్బందులు వాస్తవమే.. నోట్లు సిద్ధం చేసుకోలేకపోయాం.. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ
నోట్ల రద్దు తర్వాత ప్రజలు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత నోట్ల మార్పిడి కోసం భారీ స్థాయిలో కొత్త నోట్లను సిద్ధం చేసుకోలేకపోయామని అంగీకరించారు. మరో రెండు మూడు నెలలు ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు. త్వరలోనే అంతా సర్దుకుంటుందని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అభయమిచ్చారు. ఆదివారం తన అధ్యక్షతన ఢిల్లీలో నిర్వహించిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో నోట్ల రద్దుపై చర్చ వాడివేడిగా జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నోట్ల మార్పిడి పెద్ద సమస్యగా మారిందని, నోట్ల రద్దు కారణంగా రాష్ట్రాలు ఆర్థికంగా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పలు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం అంచనా వేసిన దానికంటే క్షేత్రస్థాయిలో నష్టం మరింత ఎక్కువగా ఉంటుందని, రద్దు ప్రభావం వచ్చే నెలలో ప్రత్యక్షంగా కనిపిస్తుందన్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని, లేదంటే రాష్ట్రాల బడ్జెట్ అంచనాలు తలకిందులయ్యే అవకాశం ఉందని మంత్రులు ఆవేదన వ్యక్తం చేశారు.