: ప్రత్యేక వార్డుకు తమిళ సీఎం.. జయ ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిందన్న పార్టీ వర్గాలు
అస్వస్థతతో బాధపడుతూ సెప్టెంబరు 22న చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది. శనివారం ఆమెను ఐసీయూ నుంచి ప్రత్యేక వార్డుకు తరలించినట్టు అన్నాడీఎంకే ప్రతినిధి సి.పొన్నాయియాన్ తెలిపారు. గత 58 రోజులుగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత ఆరోగ్యంపై బోల్డన్ని వదంతులు వ్యాపించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆమె త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు, పార్టీ కార్యకర్తలు దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత పూర్తిగా కోలుకున్నారని, త్వరలోనే ఆమె ఇంటికి చేరుకుంటారని పార్టీ శ్రేణులు నాలుగు రోజుల క్రితమే ప్రకటించాయి. అయితే ఆ తర్వాత ఆ విషయమై ఎటువంటి సమాచారం లేదు. తాజాగా శనివారం జయను ఐసీయూ నుంచి అన్ని సదుపాయాలు ఉన్న ప్రత్యేక వార్డుకు వైద్యులు తరలించినట్టు పార్టీ చేసిన ప్రకటనతో అభిమానులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు.