: కోటి రూపాయలు దాచిపెట్టిన వ్యాపారిని పట్టించిన మహిళ.. ఆపై ఆమెకే ఎదురైన కష్టాలు!
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఓ నల్ల కుబేరుడిని పట్టించి మంచిపని చేసినందుకు ఓ మహిళ కష్టాలు ఎదుర్కొంది. జహంగీర్ పురి ప్రాంతంలో పాన్ షాపు నడుపుతూ చిరు వ్యాపారం చేసుకుంటున్న అష్మినా షియాకా అనే మహిళ ఇటీవలే ఓ స్ర్కాప్ డీలరు చేసిన ఓ పనిని పసిగట్టింది. కోటి రూపాయల బ్యాగును ఇంట్లో దాచిపెట్టడాన్ని గమనించిన ఆమె ఆ విషయాన్ని స్థానిక పోలీసులకు తెలిపింది. దీంతో స్క్రాప్ డీలరు ఇంటికి వచ్చి విచారణ జరిపిన పోలీసులు అతడిని పోలీసుస్టేషనుకు తరలించారు. అయితే, ఆ తరువాతి రోజున లంచం తీసుకున్న పోలీసులు ఆ స్ర్కాప్ డీలరును వదిలిపెట్టారు. ఈ క్రమంలో, తాను పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలంటూ పోలీసులు తనపై బెదిరింపులకు దిగుతున్నారని అష్మినా చెప్పింది. ఈ అంశాన్ని బయటపెట్టకుండా ఉండేందుకు తనకు రూ.2 లక్షలు ఇస్తామని కూడా పోలీసులు తనకు చెప్పారని ఆ మహిళ ఆరోపిస్తోంది. అనంతరం ఈ విషయాన్ని ఆమె డీసీపీ మిలంద్ దుంబ్రే దృష్టికి తీసుకెళ్లింది. మహిళ తమకు తెలిపిన వివరాలపై దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ మిలంద్ మీడియాకు చెప్పారు.